తేలికగా తీసుకోవద్దు- సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
23 పట్టణ ఎన్నికల్లోనూ విజయం సాధించాలి
BreakInGuru · · రాజకీయాలు

గ్రామస్థాయి ఎన్నికలను నాయకులు తేలిగ్గా తీసుకోవద్దని పార్టీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పంచాయతీలతో పాటు 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై టీడీపీ ముఖ్యనేతలతో శనివారం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో నేతల్ని తీర్చిదిద్దేందుకు ఈ ఎన్నికలు మంచి అవకాశమని సీఎం అన్నారు. కేంద్రం, రాష్ట్రం, పురపాలికలు, జిల్లా పరిషత్తుల్లో ఎన్డీయేనే ఉందని అన్నారు. పట్టణ, పరిషత్ ఎన్నికల్లో కూటమికి చారిత్రక విజయాన్ని ఇచ్చినట్లే, కూటమి బలపరిచే అభ్యర్థులనే సర్పంచులుగా గెలిపించాలని సీఎం చంద్రబాబు కోరారు. గ్రామస్థాయిలోనూ కూటమి బలపరిచే అభ్యర్థులు గెలవాలన్నారు. అప్పుడే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా సాగుతాయని చంద్రబాబు స్పష్టం చేశారు. నాలుగు నగరపాలక సంస్థలు, 19 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు జరిగే ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులు తిరుగులేని విజయం సాధించాలని దిశానిర్దేశం చేశారు. పుర, పరిషత్తు ఎన్నికల్లో కూటమికి ప్రజలు చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టారని చంద్రబాబు పేర్కొన్నారు. 94 మున్సిపాలిటీలు, 3235 వార్డులు, 575 జడ్పీటీసీలు, 7,500కు పైగా ఎంపీటీసీ స్థానాల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులు విజయభేరి మోగించారన్నారు. ఈవీఎం, బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్ ఇలా ఏ విధానమైనా కూటమిదే హవా అని చంద్రబాబు స్పష్టం చేశారు. "గతం కంటే 25 శాతం ఓటు బ్యాంకు పెరిగింది. ఉద్యోగులంతా కూటమి ప్రభుత్వం వైపే నిలబడ్డారు. సుమారు 7 జిల్లాల్లో క్లీన్‌స్వీప్ చేశాం. అనకాపల్లి, మార్కాపురం జిల్లాల్లో 100 శాతం స్ట్రైక్‌రేట్ సాధించాం" అని చంద్రబాబు తెలిపారు. వైఎస్సార్సీపీ చేసిన తప్పుడు ప్రచారాల్ని ప్రజలు నమ్మలేదన్నారు.
గొడవలకు పోవద్దని సూచన: త్వరలో జరిగే 23 పట్టణ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులు తిరుగులేని విజయం సాధించాలన్నారు. స్థానిక ఎన్నికల్లో విద్యావంతులు, యువతకు అవకాశంమిచ్చామని గుర్తుచేశారు. ప్రజల మనోభావాల ప్రకారం పని చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో చెడ్డ పేరు తెచ్చుకోవద్దని సూచించారు. గొడవలకు పోవొద్దన్న చంద్రబాబు కొందరు హింసనే నమ్ముకుంటారని, కూటమి మాత్రం ప్రజాస్వామ్యాన్ని నమ్ముతుందని అన్నారు. అధికారాన్ని మంచి చేయడానికి, ప్రజలకు దగ్గర కావడానికి ఉపయోగించుకోవాలని నిర్దేశించారు.
ప్రజల మనోభావాలకు తగ్గట్లు పనిచేస్తే: తమ మనోభావాలకు తగ్గట్టు పనిచేసే నాయకులతో ప్రజలు ఉంటారని చంద్రబాబు తెలిపారు. మంచి చేయడానికి, ప్రజలకు దగ్గరవడానికి అధికారాన్ని ఉపయోగించాలని అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో గెలిచినవారు క్రియాశీలకంగా పనిచేయాలన్నారు. రాబోయే 30 ఏళ్లకు ఉపయోగపడేలా నాయకత్వాన్ని నిర్మించుకుందాం అని చంద్రబాబు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.