మక్తల్‌కు 4,085 కొత్త చేయూత పెన్షన్లు.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం: మంత్రి వాకిటి శ్రీహరి
కాయలు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు.. అభివృద్ధి చేస్తున్న నాపైనే విమర్శలు
BreakInguru, Chennapragada Bhanu · · తెలంగాణ

- మహిళా సాధికారతే ధ్యేయం.. కోటి మందిని కోటీశ్వరులుగా చేయడమే సీఎం సంకల్పం
- మక్తల్ నియోజకవర్గానికి కొత్తగా 4,085 చేయూత పెన్షన్ల మంజూరు
- కాయలు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు.. అభివృద్ధి చేస్తున్న నాపైనే విమర్శలు: మంత్రి వాకిటి శ్రీహరి
పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే ప్రజా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని రాష్ట్ర క్రీడా, పశుసంవర్ధక, మత్స్య,పాడి పరిశ్రమాభివృద్ధి, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. మక్తల్ పట్టణంలో కొత్తగా మంజూరైన 'చేయూత ఆసరా' పెన్షన్ల మంజూరు పత్రాలను ఆయన లబ్ధిదారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. కృష్ణా, మాగనూరు, నర్వ, ఉట్కూర్, మక్తల్ మండలాల పరిధిలో అర్హులైన 4,085 మందికి నూతనంగా పెన్షన్లు మంజూరయ్యాయని వెల్లడించారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. సాగునీరు, తాగునీరు, డ్యామ్‌ల నిర్మాణం మరియు పెన్షన్లంటే గుర్తుకొచ్చే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఆయన అన్నారు.
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నాం:
తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు అందించడమే కాకుండా, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణ బాధ్యతలను కూడా మహిళా సంఘాలకు అప్పగిస్తున్నామని వివరించారు. మహిళలు సామాజిక అంశాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఒక యజ్ఞంలా సాగుతోంది:
ఇందిరమ్మ ఇళ్లు కేవలం ప్రకటనలకే పరిమితమవుతాయని ఎద్దేవా చేసిన ప్రతిపక్షాలకు నేడు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న గృహప్రవేశాలే సమాధానమని మంత్రి ధీటైన బదులిచ్చారు. గత పదేళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైనప్పటికీ, సంక్షేమ పథకాలకు ఎక్కడా నిధుల కొరత రాకుండా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందన్నారు. అలాగే చేనేత, గీత కార్మికులకు పెన్షన్లు,రేషన్ కార్డుదారులకు నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని గుర్తుచేశారు.
రైతులకు సూచన.. ప్రతిపక్షాలకు హితవు:
ఎల్‌నినో ప్రభావం వల్ల నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని, ఆరుతడి పంటల సాగు వైపు మొగ్గు చూపాలని మంత్రి కోరారు. కరువు అనేది ప్రపంచవ్యాప్త సమస్య అని, ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రతిపక్షాలు అనవసర విమర్శలు మానుకుని ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని హితవు పలికారు.
జనవరి నుంచి మక్తల్‌లో పాదయాత్ర:
స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు మక్తల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని మంత్రి శ్రీహరి అన్నారు. కాయలు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు తగిలినట్లుగా, నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తనపై కొందరు ఉద్దేశపూర్వకంగానే దాడులు, విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎలాంటి విమర్శలకు వెరవబోనని,జనవరి నెల నుంచి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటానని ప్రకటించారు. మౌలిక వసతుల కల్పనతో పాటు సంక్షేమ పథకాలను సమన్వయం చేస్తూ మక్తల్‌ను రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు.