యువతకు ఉపరాష్ట్రపతి పిలుపు

దృఢమైన, సంతోషకరమైన, శ్రేయస్కరమైన నవభారత నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలి – ఉపరాష్ట్రపతి పిలుపు

•          వైభవోపేతమైన భారత సంస్కృతి, వారసత్వాలను యువత మరింత ముందుకు తీసుకెళ్లాలి

•          5వేల ఏళ్ల పురాతనమైన సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యతను తీసుకోవాలని సూచన

•          తిరువనంతపురంలో పి. పరమేశ్వరన్ తొలి స్మారకోపన్యాసం సందర్భంగా ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

•          దేశ శ్రేయస్సే సర్వోన్నతమని భావించిన పరమేశ్వరన్ జీవితం స్ఫూర్తిదాయకమని వెల్లడి

శ్రీ పి. పరమేశ్వరన్ వంటి ఎందరో మహనీయులు చూపించిన మార్గంలో నడుస్తూ, వైభవోపేతమైన భారత సంస్కృతి, వారసత్వాలను కొనసాగించాల్సిన బాధ్యత దేశ యువతపైనే ఉందని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

గురువారం తిరువనంతపురంలోని భారతీయ విచార్ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రీ పి.పరమేశ్వరన్ తొలి స్మారకోపన్యాసం సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ… భారత సమాజాభివృద్ధికి ప్రధాన అడ్డంకులుగా మారిన కుల, లింగ వివక్ష, అవినీతిని పారద్రోలడం ద్వారా మరింత సుదృఢమైన, సంతోషకరమైన, శ్రేయస్కరమైన భారతదేశాన్ని నిర్మించాలని దేశ యువతకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శ్రీ పి. పరమేశ్వరన్ స్మతికి నివాళులు అర్పించిన ఉపరాష్ట్రపతి.. ఆయన్ను ఓ తపస్విగా, గొప్ప మానవతావాదిగా, సామాజిక తత్వవేత్తగా అభివర్ణించారు. ఇలాంటి మహనీయుల జీవితాలనుంచి యువత ప్రేరణపొంది జాతి నిర్మాణంలో క్రియాశీలకంగా భాగస్వాములు కావాలని సూచించారు.

కేరళలో రామాయణ మాసాన్ని జరుపుకునే సంప్రదాయాన్ని మరిచిపోయిన పరిస్థితులను శ్రీ పి.పరమేశ్వరన్ పునరుద్ధరించి మళ్లీ ఆ సంప్రదాయాన్ని వినియోగంలోకి తీసుకొచ్చారని గుర్తు చేసిన ఉపరాష్ట్రపతి… రచనలు, ప్రసంగాలు, ఇతర మేధోపరమైన కార్యక్రమాల ద్వారా సమాజంతో పాటు కేరళలోని మేధావి వర్గంలో సానుకూలమైన, ఆధ్యాత్మికపరమైన జాతీయవాదం వైపు మొగ్గి మార్పు కోసం ఆయన ప్రయత్నించారన్నారు.

కేరళ భూమి, దేశానికి అందించిన మేధావుల్లో శ్రీ పరమేశ్వరన్ ఒకరన్న ఉపరాష్ట్రపతి, సాంస్కృతిక చైతన్యం, ఆధ్యాత్మిక పునరుజ్జీవనం కోసం వారు చేసిన కృషి అనిర్వచనీయమన్నారు. జగద్గురు ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, స్వామి రంగనాథానంద, మాతా అమృతానందమయి వంటి గొప్ప వ్యక్తుల దార్శనికతను, శ్రీ రామకృష్ణ మఠ్ వంటి సంస్థల సేవలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

8వ శతాబ్దపు తత్వవేత్త జగద్గురు ఆదిశంకరాచార్యుల బోధనలను ప్రస్తావిస్తూ, తన స్వీయ తత్వం ద్వారా భిన్న ఆలోచనలను, భిన్న పద్ధతులను ఏకీకృతం చేయడంతో పాటు, అద్వైత సిద్ధాంతాన్ని తీసుకొచ్చి పండితులకే పరిమితమైన గీతాసారాన్ని సమాజానికి పంచిన మహనీయుడన్నారు. కేరళకు చెందిన సంఘ సంస్కర్త శ్రీ నారాయణ గురు తీసుకొచ్చిన మార్పులను కూడా ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. ఇలాంటి ఎందరోమంది మహనీయుల కృషికారణంగానే, భారతీయ నాగరికత, సంస్కృతి, సంప్రదాయాలు విదేశీ దాడులను ఎదుర్కొని సజీవంగా నిలిచాయన్నారు.

ఐదువేల ఏళ్లనాటి మన నాగరికత, సాంస్కృతిక విలువలు భారతీయ సమాజంలో పాతుకుపోయి ఉండటం కారణంగానే భిన్నత్వంలో ఏకత్వాన్ని భారతదేశం ముందుకు తీసుకెళ్లగలుగుతోందన్నారు. రామాయణ, మహాభారతాల వంటి మహాగ్రంథాలు భారతీయ విధానానికి, హిందూ జీవన విధానానికి మార్గదర్శకాలుగా ఉన్నాయని, భారతదేశంతో పాటు ఆసియా వ్యాప్తంగా ఈ గ్రంథాల ప్రభావం స్పష్టంగా కనబడుతోందన్నారు.

సర్వభూత హితం (అందరి సంక్షేమం) కోరుతూ మన వైదిక రుషి పరంపర, సద్గురువులు మానవ జీవనానికి మార్గదర్శనం చేశారని గుర్తు చేసిన ఉపరాష్ట్రపతి, జ్ఞానంతో నిండిన సంప్రదాయం, విలువలతో కూడిన సంస్కృతిని మనకు అందించిన మహర్షులకు, సద్గురువులకు మనం రుణపడి ఉండాలని తెలిపారు. ‘వారు తమ జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక అనుభవాన్ని మన సమాజం శ్రేయస్సుకోసం ధర్మరూపంలో అందించారు’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

భగవద్గీతను ఓ సమగ్రమైన శాస్త్రంగా, సమాజంలోని ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపే కేంద్రంగా శ్రీ పరమేశ్వరన్ జీ ప్రఖ్యాతిలోకి తీసుకొచ్చారన్న ఉపరాష్ట్రపతి, యోగ – గీతల సారాన్ని కలిపి చదివే ప్రక్రియకు ‘సంయోగి’ అని కొత్త పదాన్ని సృష్టించారని పేర్కొన్నారు.

గొప్ప వ్యవస్థను నిర్మించిన వ్యక్తి శ్రీ పరమేశ్వరన్ అన్న ఉపరాష్ట్రపతి, శ్రీ దీన్‌దయాళ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్,  భారతీయ విచార్ కేంద్ర, వివేకానంద కేంద్ర వంటి సంస్థల స్థాపనలో కీలకమైన భూమిక పోషించారన్నారు. భారతీయ సమాజానికి వారు చేసిన విశిష్టమైన సేవలకు గుర్తింపుగా వారు పొందిన అవార్డులు, గౌరవాలను ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2004లో పద్మశ్రీ, 2018లో పద్మవిభూషణ్ గౌరవాలను పొందారన్నారు. ‘శ్రీ పరమేశ్వరన్ స్ఫూర్తితో ఎందరో మంది యువకులు రచనలు, పరిశోధలనపై ఆసక్తిని పెంపొందించుకున్నారు’ అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కేరళ గవర్నర్ శ్రీ ఆరీఫ్ మొహ్మద్ ఖాన్, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి శ్రీ వి.మురళిధరన్, స్థానిక శాసన సభ్యులు శ్రీ ఓ.రాజగోపాల్, భారతీయ విచార్ కేంద్ర జాయింట్ డైరక్టర్ శ్రీ ఆర్. సంజయన్ సహా పలువురు విద్యావేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.