దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాల మీదకు ఎక్కాలంటే ..? – సీఎం జగన్

రాష్ట్ర విభజన వల్ల ఏపీ ఎంతో నష్టపోయిందని, పారిశ్రామికంగా, మౌలిక వసతులు పరంగా, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన వంటివి సాధ్యపడాలంటే కేవలం రాష్ట్రానికి ప్రత్యేక హోదా తోనే సాధ్యమౌతుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన నీతి అయోగ్ ఆరవ పాలక మండలి సమావేశంలో జగన్ పాల్గొన్నారు. మౌలిక సదుపాయాలు, ప్రొడక్షన్, వ్యవసాయం, పౌష్టికాహారం తదుపరి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. విభజనకు ముందు పార్లమెంటు సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించినట్లు  ఈ సంధర్భంగా ఆయన గుర్తుచేశారు.రాష్ట్రంలో టయర్‌-1 నగరం కూడా లేదని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

 ‘కోవిడ్‌ మహమ్మారితో ఆర్థిక పరిస్థితి తలకిందులైన నేపథ్యంలో జరుగుతున్న నీతి ఆయోగ్‌ సమావేశం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. కోవిడ్‌ కారణంగా దెబ్బ తిన్న దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాల మీదకు ఎక్కించడానికి ఉన్న అవకాశాలన్నింటినీ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారం, సంప్రదింపుల ద్వారా పరిశీలించాలి. దీనికోసం అర్థవంతమైన చర్చలు జరగాలి. దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునేలా ఒక నిర్దిష్ట విధానాన్ని రూపొందించుకోవాలి’ అని సీఎం వైఎస్‌ జగన్ నీతి ఆయోగ్‌ సమావేశంలో తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరు ప్రధాన అంశాలు అత్యంత కీలకమైనవని పేర్కొన్నారు.