జగన్నాటకానికి అటు ఇటు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు.. మాజీ సీఎం చంద్రబాబును ఎందుకు టార్గెట్ చేస్తున్నారు…చంద్రబాబును జైలుకు పంపితే… సింపధీ పెరిగి.. ఆయనకే మంచిది కదా.. ఇలాంటి ప్రశ్నలు రెండు రోజులుగా తీవ్రచర్చనీయాంశమవుతున్నాయి.

నిజానికి జగన్ మాస్టర్ ప్లాన్‌తోనే ఇలాంటి వ్యూహాలు పన్నుతున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్వీయానుభవం కంటే..ఇతరుల తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకోవడంలో జగన్ దిట్ట. రాజకీయాల్లో కూడా అదే జరిగింది. తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పిదాలను చూసి, ఏపీలో రేపు జరగబోయే పరిణామాలను అంచనా వేసిన తర్వాతే జగన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

మమతా బెనర్జీ స్వయం కృషితో ఎదిగిన నాయకురాలని చెప్పడంలో సందేహం లేదు. తాను చెప్పిందే వేదం, చేసిందే రాజకీయం అని మాత్రం ఆమె ఎప్పుడో నిర్ణయించుకున్నారు. ఏకస్వామ్య రాజకీయాలకు తెరతీయాలని, రాజకీయాల్లో సంపూర్ణ పోటీ ఉండకూడదని ఆమె నిర్ణయానికి వచ్చి చాలా రోజులైంది. వామపక్షాలపై వ్యతిరేకతను ఆసరాగా తీసుకుని మమత ఎదిగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బైటకు వచ్చి ఆ పార్టీనే భూస్థాపితం చేయాలనుకున్నారు. అక్కడే తప్పులో కాలేశారు. పనిగట్టుకుని కాంగ్రెస్, కమ్యూనిస్టులను దెబ్బకొట్టారు. తృణమూల్ కేడర్‌ ఆ పార్టీల శ్రేణులను భయభ్రాంతులను చేసేందుకు చేపట్టని చర్య లేదు. పైగా అప్పటికే ఆ రెండు పార్టీల పట్ల జనం విసిగిపోయారు.అధికారం దిశగా మమతకు మార్గం సుగమమైనప్పటికీ అధికారాన్ని సుస్థిరం చేసుకునే క్రమంలో తప్పటడుగులు వేశారు.

కాంగ్రెస్, కమ్యూనిస్టులను మమత దెబ్బకొట్టారు క్షేత్రస్థాయిలో వారికి బలం లేకుండా చేశారు. జనం ఏకమొత్తంగా తనవైపే ఉంటారని ఆమె విశ్వసించారు. ఓటర్లు మాత్రం మరోలా ఆలోచించారు. ఏ దేశంలోనూ జనం వంద శాతం అధికార పార్టీ వైపే ఉండరు. బలమైన ప్రతిపక్షం ఉండాలని జనం ఆకాంక్షిస్తారు. బెంగాల్‌లో కూడా అదే జరిగింది. కాంగ్రెస్, కమ్యూనిస్టులను మమత శంకరగిరి మాన్యాలు పట్టిస్తే.. ఆ రెండు పార్టీల సానుభూతిపరులు కొత్త మార్గం వెదికారు మమతను సమర్థించడం ఇష్టంలేని వారంతా క్రమంగా బీజేపీ వైపు మొగ్గు చూపారు. అందుకే గత ఐదేళ్లుగా బెంగాల్‌లో బీజేపీ బలపడుతూ వస్తోంది. నిన్నటి దాకా ఒక శాతం ఓటింగ్ కూడా లేని కమలం పార్టీ ఇప్పుడు ఏకంగా 24 శాతం ఓటు బ్యాంకును సొంతం చేసుకుంది. మూడు అసెంబ్లీ స్థానాలున్న బీజేపీ ఈ సారి 99 స్థానాలను కైవసం చేసుకున్నా ఆశ్చర్యం లేదని సర్వేలు తేల్చాయి. ఇప్పుడు మమతా బెనర్జీ తలపట్టుకు కూర్చునే దుస్థితి ఏర్పడింది.

కట్ చేసి చూస్తే తెలంగాణలోనూ అదే పరిస్థితి. అధికారానికి వచ్చినప్పటి నుంచి కేసీఆర్‌కు ఒకటే ఆశ. ప్రతిపక్షం లేకుండా చూసుకోవాలనే ఆశ. అందుకే ప్రధాన ప్రతిపక్షాన్ని దెబ్బతీయడమే ఏకైక అజెండాగా పెట్టుకున్నారు. ఆ పార్టీ నుంచి వలసలను ప్రోత్సహించారు. దానితో టీఆర్ఎస్ వ్యతిరేకులందరికీ కొత్త అనుమానాలు తలెత్తాయి. కాంగ్రెస్‌కు ఓటేస్తే టీఆర్‌ఎస్‌కు వేసినట్లే అవుతుందని నిర్ణయానికి వచ్చారు. వారికి తటస్థులు కూడా తోడయ్యారు. జాతీయ పార్టీ బీజేపీ వైపు వెళితే.. బావుంటుందని అనుకున్నారు. ప్రజల ఆలోచనకు ప్రతిరూపమే దుబ్బాక, జీహెచ్‌ఎంపీ ఫలితమని చెప్పుకోవాలి.

తెలంగాణ, బెంగాల్ పరిణామాలను చూస్తున్న జగన్‌కు తన భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థమైపోయింది. కాస్త అవకాశం ఇస్తే ఏపీలోనూ ఆ రెండు రాష్ట్రాల పరిణామాలు ఖాయమని జగన్ అనుకుని ఉండొచ్చు. పైగా కేంద్రంలో ఉన్న అధికారాన్ని ఉపయోగించుకుని బీజేపీ ఏదైనా చేయెచ్చు. ప్రస్తుతం తనకు 45 నుంచి 50 శాతం ఓట్లు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే అంశం వెల్లడైంది. తన ఓటు బ్యాంకుకు ఇప్పుడప్పుడే ఢోకా లేదు. అలాగని ప్రత్యర్తులను బలపడనివ్వకూడదు. విపక్ష ఓటు సంఘటితం కాకుండా చూసుకోవాలి. టీడీపీ బలహీనపడకుండా చూసుకోవడమే ఇందులో మరో కోణం.

దేశంలో ప్రజలు తమ నేతలను తొందరగా మరిచిపోతారు. కొత్త నేతలు వస్తే పాత నేతలను చూసిచూడనట్లు వదిలేస్తారు. జనం చంద్రబాబుపై అదే ఆలోచన పెట్టుకుంటే.. ఓటు బ్యాంక్ మరో పార్టీకి తరలిపోతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో లేచి నిల్చునే అవకాశం లేదు. అంగబలం, అర్థబలంతో బీజేపీ మాత్రమే దూసుకుపోగలదు. ఒక సారి జాతీయ పార్టీ కాలు మోపితే.. ప్రాంతీయ పార్టీల పని అథోగతి అవుతుంది. అందుకే బీజేపీ బలపడకుండా ఉండాలంటే విపక్షప్రాంతీయ పార్టీ పటిష్టంగా ఉండాలి. అధికారంలో లేని ఆ పార్టీ క్రియాశీలంగా కొనసాగాలి.

తెలుగు ప్రజల్లో చంద్రబాబు పట్ల ప్రత్యేకమైన అభిమానం కొంత ఉందని చెప్పక తప్పదు. ఆయనకు దెబ్బతగిలితే… తమకు నొప్పి పుడుతోందని కూడా వారి నమ్ముతుంటారు. అందుకే పార్టీ ఓడిపోయినా,, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ధనం ఏరులై పారినా.. టీడీపీకి 30 శాతం ఓట్లు వచ్చాయి. జగన్‌కు కావాల్సింది కూడా అదే. టీడీపీ మినిమమ్ ఓటు బ్యాంక్‌లో చలనం ఉండకూడదు. ఆ దిశగా చంద్రబాబు రోజూ వార్తల్లో వ్యక్తిగా ఉండాలి. ఆయన ఇబ్బంది పడితే జనం ఆందోళన చెందాలి. చంద్రబాబుపై వచ్చే కేసులతో సింపథీ బాగా పెరగాలి జగన్‌ పెట్టే ఇబ్బందులే చంద్రబాబు పట్ల సానుభూతి పొంగి పొర్లి ఆయన మళ్లీ సీఎం అవుతారన్న ప్రచారం జరగాలి. అప్పుడు చంద్రబాబు బలం చెక్కు చెదరదు. బీజేపీ ఉన్న చోటే ఉంటుంది. తన అధికారానికి ఆటంకాలు ఎదురుకావు. ఇదీ జగన్ గేమ్ ప్లాన్….

Annapragada BollamRaju

Sr. Journalist