ఆదివాసీల మనుగడే విశాఖ శారదాపీఠానికి ముఖ్యం

– విశాఖ ఏజెన్సీకి చేరిన హిందూ ధర్మ ప్రచార యాత్ర
– అరకులోయలో ఆదివాసీల కోసం ఉచిత వైద్య శిబిరం
– ఏవోబీలోనూ పర్యటించిన ఉత్తర పీఠాధిపతులు

అడవి బిడ్డలు దేవుడితో సమానం అని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి అన్నారు. ప్రకృతి ఒడిలో కల్మషం లేని జీవితాన్ని గడిపే అదృష్టం వారికి మాత్రమే దక్కుతుందని చెప్పారు. మాధవసేవ కన్నా మానవ సేవకు ప్రాధాన్యమిచ్చే విశాఖ శ్రీ శారదాపీఠం ఆదివాసీ కోసం ధర్మపోరాటాలను సైతం చేపట్టిందని తెలిపారు. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ గతంలో తమ గురువులు స్వరూపానందేంద్ర స్వామి గళం విప్పారని గుర్తుచేశారు. గిరిజనుల మనుగడను దెబ్బతీసే ఎటువంటి ప్రయత్నాలనైనా విశాఖ శ్రీ శారదాపీఠం అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. హిందూ ధర్మ ప్రచార యాత్రను గురువారం విశాఖ ఏజెన్సీలో కొనసాగించారు. అరకు, అనంతగిరి, ఆంధ్రాఒడిశా సరిహద్దు జిల్లా కోరాపుట్ ప్రాంతాల్లో ఈ యాత్ర కొనసాగింది. ఆదివాసీల కోసం ప్రత్యేకంగా అరకులోయలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని విశాఖ శ్రీ శారదాపీఠం నిర్వహించింది. 14 విభాగాలకు చెందిన వైద్యులు ఈ శిబిరంలో గిరిజనులకు పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అంతకుముందు అరకులోయలోని వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని స్వామీజీ సందర్శించారు. అలాగే కృష్ణ మందిరానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కంఠబంసుగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ క్లాస్ రూమును, యండపల్లివలస బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో బోర్ వెల్ ను, అరకువ్యాలీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాటర్ ప్లాంటును ప్రారంభించారు. గురుదేవా ఛారిటబుల్ ట్రస్టు సహకారంతో ఈ సేవా కార్యక్రమాలకు విశాఖ శ్రీ శారదాపీఠం శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత కొత్త బలుగూడ వెళ్ళి ఆదివాసీలకు భగవద్గీత, గిరిజన మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఆంధ్రా ఒడిశా సరిహద్దు జిల్లా కోరాపుట్ ప్రాంతంలోనూ స్వామీజీ హిందూ ధర్మ ప్రచార యాత్ర నిర్వహించారు. పాడువా గ్రామంలో గిరిజనులు తరిగొండ వెంగమాంబ పేరిట భజన బృందాలను నిర్వహించడం చూసి అభినందించారు. పాడువా పరిసర గ్రామాల ప్రజలు స్వామీజీకి సాంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. రామ నామ జపం చేస్తూ గ్రామంలోనికి తీసుకు వెళ్లారు. గిరిజనుల సంప్రదాయం మేరకు డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో స్వాగతం పలికారు.