‘పాలాక్షుని డైరీ’ సృష్టికర్త ఇక లేరు

‘ఆంధ్రపత్రిక సచిత్ర వార పత్రిక’లో ‘ఫాలాక్షుని డైరీ పేరిట దశాబ్దాలపాటు కాలమ్ రాసిన శ్రీ జొన్నలగడ్డ భూపతిరాజు ఈరోజు ఉదయం 9గంటల ప్రాంతంలో హైదరాబాద్ లో దివంగతులయ్యారు. బెజవాడలో జన్మించిన ఆయన వయస్సు 82 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మంచి సాహితీవేత్త, బాపు-రమణలకు ఆత్మీయుడు.  ఆంధ్రపత్రిక సారధులు శివలెంక శంభుప్రసాద్ గారితో సాన్నిహిత్యం ఉండేది. ఆ పరిచయం తోనే ఎన్నో సంవత్సరాల పాటు వారం వారం క్రమం తప్పకుండా ‘పాలాక్షుని డైరీ’ కాలం రాసేరు.


ప్రైవేటురంగంలో చెన్నై కేంద్రం గా ఉన్న ఎంజిఎం ట్రాన్స్ పోర్టు కంపెనీలో 30 ఏళ్ళు పైగా పనిచేసి జనరల్ మేనేజర్ స్థాయికి వెళ్లేరు. ప్రస్తుతం ఈ వయసులో కూడా కర్నాటక కేంద్రంగా ఉన్న ప్రైవేటు ట్రాన్స్ పోర్టు సంస్థలో సేవలు అందిస్తున్న వీరు నిన్న కూడా విధులు నిర్వహించేరు.
వీరు పాత్రికేయ వృత్తిలో లేకపోయినా ఎంతో ఆసక్తికరంగా పాలాక్షుడి డైరీ రాసేవారు. ఆయన పేరు వచ్చేది కాదు. అంతా రచయిత పేరు పాలాక్షుడు అనుకునే వారు.


వీరి తమ్ముళ్లు ఇద్దరూ పత్రికేయ రంగంలో సేవలు అందించేరు. ఆంధ్ర పత్రిక, ఉదయం, వార్త దిన పత్రికలలో ఎంతో యాక్టివ్ జర్నలిస్ట్ గా ఉన్న వారి పెద్ద తమ్ముడు జొన్నలగడ్డ రాధాకృష్ణ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు కూడా చదువుతూండేవారు. నాకు మంచి మిత్రుడు కూడా. వీరి చిన్న తమ్ముడు జొన్నలగడ్డ కిశోర్ సినిమా జర్నలిస్ట్ గా పనిచేసేరు. ఈ ఇద్దరు పాత్రికేయ తమ్ముళ్లు ముందుగానే కాలం చేసేరు.


జొన్నలగడ్డ భూపతిరాజు గారి పాలాక్షుని డైరీ కాలం ‘ఆంధ్రపత్రిక’ వారపత్రికలో ఎంతో ఆసక్తిగా చదివేవాడిని. దేశంలో ఎక్కడెక్కడో జరిగిన ఆఫ్ బీట్ ఘటనలను ఏర్చికూర్చి ఇంట్రస్టింగ్ గా ప్రజెంట్ చేసేవారు.
(పాలాక్షుని డైరీ సృష్టి కర్త జొన్నలగడ్డ భూపతిరాజు గారి కుమార్తె అపర్ణ (హైదరాబాద్) కంటాక్ట్ నెంబరు: 7678585701).
బి.ఎస్.రామకృష్ణ/బిఎస్ ఆర్ (05-04-2021).