తిట్టుకుందాం రా!

స్థాయి, హోదా, వయసు, భాష, ఆడ, మగ.. ఏ తేడా లేదు, ఎంతకైనా తెగించేందుకు రెఢీ అంటున్న పోలిటీషియన్స్ ఇస్తున్న ఎంటర్ టైన్ మెంట్ అంతా ఇంతా కాదు. వారి భాషా పాండిత్యానికి వీజీగా వెలకట్టలేం.తెలంగాణ లో కెసిఆర్ ప్రత్యర్థులను చీల్చి చెండాడే తీరే వేరబ్బా అనుకునే రోజులు పోయాయి.మరీ ముఖ్యంగా బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర బిజెపి ప్రెసిడెంట్ అయ్యాక కెసిఆర్ టార్గెట్ గా వదులుతున్న వాక్బాణాలు మస్తు మజాగానే ఉంటున్నాయి. ఇంతవరకు కెసిఆర్ ని డైరెక్ట్ గా అదే రేంజ్ లో ఉతికి పారేస్తున్నపద్ధతి కాషాయ కండువా కప్పుకున్న వారికి ఇంధనంలా పనిచేస్తోంది. మరో రెండు రెట్లు మించి రెచ్చిపోతున్నారు.తాజాగా టిఆర్ ఎస్ మాజీ ఎంఎల్ ఏ, బిజెపి తీర్థం పుచ్చుకున్న బోడిగ శోభ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని సభలో సంజయ్ సమక్షంలో చెలరేగిపోయిన వైనం వైరల్ కాకుండా ఉంటుందా.. డైరెక్ట్ గా కెసిఆర్ ను, పర్సనల్ గా ఆయన కుటుంబాన్నీ ఏకేసిన పద్ధతి చూస్తే బిజెపి మాటల జోరు ఎలా ఉండబోతున్నదో అంచనా వేయచ్చు. కెసిఆర్, కెటిఆర్, సంతోష్, వినోద్ కుమార్.. ఇలా ఎవర్నీ వదిలి పెట్టలేదు. పేరు పేరునా పూర్తిగా వ్యక్తిగత టార్గెట్ గా ఆరోపణలు, తిట్ల పర్వంతో శోభక్క ఉపన్యాసం సాగింది.


నియోజకవర్గ స్థాయి నాయకుడొకరు మర్నాడు ఇలానే మాట్లాడితే శోభక్క నాలుక చీరుస్తాం అంటూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే, తనకు బెదరింపు కాల్స్ వస్తున్నాయనీ, తన ప్రాణానికి ఏమైనా హాని జరిగితే కెసిఆరే బాధ్యత వహించాలంటూ శోభక్క పోలీసులకు ఫిర్యాదు చేసింది.పరిస్థితి చూస్తూంటే ముందు ముందు మరింత మజా దొరికేట్టే ఉంది. వైరల్ వీడియోల కోసం ఎదురు చూడండి. ఆనందించండి.