గోదావరిలో స్వాత్మానందేంద్ర పుణ్యస్నానం

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతులు చేపట్టిన హిందూ ధర్మ ప్రచార యాత్ర గోదావరి జిల్లాల్లో కొనసాగుతోంది. మంగళవారం వేకువజామున కొవ్వూరు వద్ద గోదావరి తీరంలో స్వామీజీ పుణ్యస్నానం చేసారు. సూక్త పారాయణ చేసి జపమాచరించారు. అలాగే పవిత్ర గోదావరి జలాలలో దండ తర్పణ నిర్వహించారు. గోదావరి మాతకు హారతులిచ్చి ప్రత్యేక పూజలు చేశారు. విశాఖ శ్రీ శారదాపీఠం తరపున గోదావరి నదీమతల్లికి పట్టువస్త్రాలు సమర్పించారు. 

అనంతరం గోష్పాద క్షేత్రాన్ని సందర్శించారు. ఆలయ పండితులు గోష్పాద క్షేత్రం విశిష్టతను స్వామీజీకి వివరించారు. ఈ క్షేత్రంలో వెలసిన శివలింగానికి పంచామృతాలతో అభిషేకం  నిర్వహించారు. అనంతరం గోదావరి తీరంలోని సంస్కృత భారతి ప్రతినిధులతో జరిగిన చర్చాగోష్టిలో స్వామీజీ పాల్గొన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో సంస్కృత భాషలో ఈ చర్చ సాగింది.

హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు విశాఖ శ్రీ శారదాపీఠం కృషి చేస్తోందని పండితులకు స్వామీజీ వివరించారు. పాఠశాల స్థాయిలో సంస్కృత భాషను తప్పనిసరి చేసేలా కృషి చేయాలని స్వామీజీకి విన్నవించారు సంస్కృతభారతి ప్రతినిధులు.