అచంచలమైన దైవభక్తి ఆదివాసీల సొంతం – స్వాత్మానందేంద్ర స్వామి

ఆదివాసీల్లో దైవభక్తి అచంచలమైనదని అన్నారు విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి. భగవంతుడిని తనలో ఐక్యం చేసుకోవాలన్న తపన గిరిజనులకు ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఏకలవ్యుడు, భక్తకన్నప్ప వంటి గొప్ప భక్తులెందరో ఆదివాసీలేనని గుర్తుచేశారు. ప్రకృతి ఒడిలో జీవించడం గొప్పవరమని, పర మతస్తుల ప్రలోభాలకు లొంగవద్దని హితవు చెప్పారు. విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన హిందూ ధర్మ ప్రచార యాత్ర విశాఖ ఏజెన్సీలో మూడో రోజూ కొనసాగింది. ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి శనివారం పాడేరు, ఉక్కుర్భ, అడ్డుమండ, హుకుంపేట, సంతబయలు, మఠం, కిండంగి అటవీ ప్రాంతాల్లో యాత్ర నిర్వహించారు.

పాడేరు మోదకొండమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో రుద్రహోమానికి హాజరయ్యారు. ఆలయ పంచాంగాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు ఉక్కుర్భలోని భీమలింగేశ్వర స్వామి ఆలయాన్ని అడ్డుమండ శివాలయాన్ని సందర్శించారు. కిండంగి గ్రామాన్ని సందర్శించి ఆదివాసీలతో ముచ్చటించారు. మఠం గ్రామంలో ఆంధ్ర వనవాసీ కళ్యాణాశ్రమ్ సంస్థ నిర్వహిస్తున్న అనాధ బాలల గురుకులాన్ని సందర్శించారు. అక్కడి గిరిజనులకు చీరలు పంపిణీ చేశారు. ఆశ్రమ విద్యార్థులు అనేక శ్లోకాలను వల్లె వేసి స్వాత్మానందేంద్ర స్వామి ప్రశంసలు అందుకున్నారు. మఠంలో ఆదివాసీలు ఆరాధ్య దైవంగా భావించే మత్స్యదేవుని క్షేత్రాన్ని స్వామీజీ సందర్శించారు. శనివారంతో హిందూ ధర్మ ప్రచార యాత్ర విశాఖ ఏజెన్సీలో ముగిసింది.